నల్లమలలో ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీఎస్

గురువారం, 10 సెప్టెంబరు 2009 (11:13 IST)
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం బుధవారం సందర్శించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమకాంత్ రెడ్డి, డీజీపీ ఎస్ఎస్‌పి.యాదవ్, గ్రేహౌండ్స్ దళ అధిపతి, ఇంటలిజెన్స్ చీఫ్‌తో పాటు. ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

నిత్యం ఏసీ కారుల్లో ప్రయాణించే వీరంతా.. పావురాలగుట్టను చేరుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. వాగులు... వంకలు... రాళ్లు... రప్పలు... పెద్ద పెద్ద గుండ్రాళ్లు.. నీళ్లల్లో వాటిని ఎక్కుతూ దిగుతూ.. సుమారు 355 అడుగుల ఎత్తులో ఉన్న కొండను ఎక్కి, ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఆ సమయంలో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

ఈ సందర్భంగా సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందిన నల్లమలలోని పావురాలగుట్ట వద్ద వైఎస్‌ఆర్‌ స్మారక స్థూపం నిర్మించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌ రెడ్డి తెలిపారు. అనంతరం సంఘటన స్థలం వద్దే సీఎస్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం స్మారక స్థూపం పనులను 2010 సెప్టెంబర్‌ 2వ తేదీలోపు పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని తేల్చి చెప్పారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని అటవీ అధికారితో సర్వే చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. సీఎం మృతి చెందిన ప్రాంతం అభయారణ్యం కావడంతో కేంద్రం అనుమతి అవసరమన్నారు.

వెబ్దునియా పై చదవండి