నారా లోకేష్: వీధికో బెల్టు షాపు.. ఇదే కాంగ్రెస్ అభివృద్ధి!

గురువారం, 7 మార్చి 2013 (16:18 IST)
FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎప్పడూ ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌, ఆఫీస్ వర్క్‌లో పరిమితమై బిజీ బిజీగా ఉండే నారా లోకేష్.. చిత్తూరులో పర్యటన చేపట్టారు.

వి.కోట మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన లోకేష్ కుప్పంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వీధికో బెల్టు షాపు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటోందన్నారు. వీధికో బెల్టు షాపు పెట్టడమే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెసు హయాంలో ఛార్జీలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అండగా ఉంటుందని చెప్పారు.

విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిన సర్కారు విద్యుత్ సరఫరాను మాత్రం తగ్గించిందని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కనుచూపుమేరలో కనబడడంలేదని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి