నింగి.. నేల.. జలం.. రోదసీ.. ఇలా...అన్నిమార్గాల్లో!

గురువారం, 3 సెప్టెంబరు 2009 (06:05 IST)
రాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవంగా వెలుగొందుతూ మాయమైన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆచూకీ తెలుసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు అన్ని రకాల చర్యలు చేపట్టాయి. నింగి. నేల, జలం, రోదశీ.. ఇలా అన్ని మార్గాల్లోనూ వైఎస్ ప్రయాణించే హెలికాఫ్టర్ ఆనవాళ్ళను తెలుసుకునేందుకు ముమ్మరంగా అన్వేషణ సాగుతున్నాయి. అయితే, వైఎస్ కనిపించకుండా పోయి 20 గంటలు అవుతున్నా... గాలింపు బలగాలు అణు మాత్రమైనా సమాచారాన్ని తెలుసుకోలేక పోయింది.

ఇదిలావుండగా.. ఆచూకీ తెలియని ఒక ముఖ్యమంత్రి కోసం విదేశాల సాయం కోరడం ఇదే తొలిసారి. అంతేకాకుండా.. ఇంత భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం కూడా దేశంలోనే ఇదే అతిపెద్దది. ప్రధానంగా.. అమెరికా రక్షణ శాఖ సాయం కోరడం అరుదైన విషయంగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముఖ్యమంత్రి వైఎస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా.. యుద్ధ సమయాల్లో ఉపయోగించే సుఖోయ్ రకం విమానాలను సైతం రంగంలోకి దింపిన కేంద్రం.. ఇస్రో, అమెరికా, రష్యా ఉపగ్రహాలు సాయం కోరడం ఇదే తొలిసారి. అవకాశం ఉన్న అన్ని మార్గాలు, కోణాల్లో వైఎస్ జాడ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

దీనికి తోడు భారీ సంఖ్యలో సాయుధ బలగాలను రంగంలోకి దించారు. ఒక్క సీఆర్పీఎఫ్ బలగాలు ఐదు వేలు మంది బలగాలు, ఆర్మీ, గ్రే హౌండ్స్, పోలీసులు ఇస్రో, ఎయిర్‌ఫోర్స్, ఎన్ఎస్ఏ అక్టోపస్, పదుల సంఖ్యలో యుద్ద విమానాలను వినియోగిస్తున్నాయి. కాగా, గురువారం తెల్లవారు జాము నుంచి నల్లమల అడవుల్లో భారీ కురుస్తున్న వర్షం కాస్త తెరప ఇచ్చింది. ఫలితంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

వెబ్దునియా పై చదవండి