పదవులతో మభ్యపెడితే సహించం: దామోదర్ రెడ్డి

ఆదివారం, 10 జనవరి 2010 (13:32 IST)
తెలంగాణ సమస్యను మరుగున పెట్టేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు పదవుల పందేరానికి దిగారని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు. పదవులతో తమ ప్రాంత నేతలను మభ్యపెట్టలేరని, అలాగే, ఉద్యమాన్ని కూడా బలహీన పరచలేరన్నారు.

తెలంగాణకు చెందిన సమర్థవంతమైన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు చేసిన ప్రకటనపై దామోదర్ రెడ్డి మండిపడ్డారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. తమ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఉద్యమం బలహీనపడుతుందని కావూరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. తెలంగాణ నేతలను పదవులతో మభ్యపెడితే లొంగబోరన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నట్టు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. తమ ప్రాంతం సభ్యులెవరూ ఆ పని చేయడం లేదన్నారు. ఈనెల 12వ తేదీన జరిగే తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం ఎంతో కీలకమైందన్నారు. అందువల్ల కేంద్రం సత్వరం తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి