పాల్వాయి గోవర్ధన్ రెడ్డి : థ్యాంక్స్.. సోనియా తర్వాత చెప్పమన్నారు!

బుధవారం, 10 జులై 2013 (19:01 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పేందుకు వెళ్లగా... 'ఇప్పుడే ఎందుకు? తర్వాత చెప్పండి థ్యాంక్స్' అని సోనియా గాంధీ చెప్పారన్నారు.

తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, క్షేత్రస్థాయి కార్యకర్తలంతా తెలంగాణ వస్తోందంటూ ఆనందిస్తున్నారని.. కాబట్టి వారందరి తరపున 'థ్యాంక్స్' చెబుతున్నానని ఆమెతో అన్నట్లు తెలిపారు. దీనిపై సోనియాగాంధీ స్పందిస్తూ సంతోషమని, అయితే కోర్‌కమిటీ సమావేశం తర్వాత అంతా ప్రకటిస్తామని, అప్పుడే థ్యాంక్స్ చెప్పాలని అన్నట్లు పాల్వాయి తెలిపారు.

చాలామంది అపాయింట్‌మెంట్లు కోరుతున్నారని తాను సోనియా వద్ద ప్రస్తావించగా.. నిర్ణయం ప్రకటించిన తర్వాతనే వారందరినీ కలుస్తానని ఆమె చెప్పినట్లు పాల్వాయి తెలిపారు. కాగా, రాష్ట్రంలో నదీజలాల పంపిణీ, ఆస్తులు - ఆదాయాల పంపిణీ, శాంతి భద్రతలు - రక్షణ మొదలైన అంశాలపై సోనియాకు గల అనుమానాలు నివృత్తి చేసేలా నివేదిక ఇచ్చినట్టు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి