ప్రజా కోర్టులో వైఎస్ దోషి: చంద్రబాబు

రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రజాకోర్టులో దోషిగా మారక తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. మొద్దుశీను హత్యపై ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పరిటాల రవీంద్ర హత్య కేసు బండారం బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే మొద్దుశీనును హత్య చేయించారని అన్నారు.

ఈ హత్య వెనుక ముఖ్యమంత్రి వైఎస్సార్, ఆయన కుమారుడు వైఎస్.జగన్, రాష్ట్ర మంత్రి జేసి.దివాకర్ రెడ్డిల హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాకుండా.. జైలు గదిలో హత్య జరుగుతుంటే మిగిలి ఖైదీలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక బారక్‌లో ఆరుగురు ఖైదీలు ఉన్నట్టు జైలు అధికారులు చెపుతున్నారన్నారు.

అలాగే హత్యా స్థలాన్ని సిట్టింగ్ జడ్జి, మీడియా సమక్షంలో పరిశీలించి, హత్యకు వాడిన ఆయుధాలను, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ, జైలు గోడల మధ్య ఉండే ఖైదీ దారుణ హత్యకు గురికావడం ఒక్క మన రాష్ట్రంలో మినహా ప్రపంచంలో ఎక్కడా జరగదన్నారు.

మొద్దుశీను మృతదేహానికి సిట్టింగ్ జడ్జి సమక్షంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. మొద్దుశీను గదిలో ఉన్న మిగిలిన ఆరుగురు ఖైదీల పేర్లను జైలు అధికారులు వెల్లడించడం లేదన్నారు. హత్యకు నైతిక బాధ్యత వహిస్తూ.. సీఎం వైఎస్సార్, హోం మంత్రి జానారెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.

మొద్దుశీను హత్య అనంతరం చంద్రబాబు తెదేపా సీనియర్ నేతలతో తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాగా, అనంతపురానికి తెదేపా ప్రత్యేక బృందాన్ని పంపనుంది. ఒక పథకం ప్రకారమే మొద్దుశీనును హతమార్చారని తెదేపా సీనియర్ నేతలు ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి