ప్రజా సంక్షేమంపైనే వైఎస్సార్ చివరి మాటలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చివరిసారి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం విఫలమైంది. చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఆయన ప్రారంభించాలనుకున్న "రచ్చబండ" కార్యక్రమం విషాదాంతమైంది. జన హృదయాలు గెలుచుకున్న మహోన్నత నేత ప్రజల్లోకి మరోసారి వెళ్లేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతి రోజే చేపట్టిన ఈ యాత్ర ఆయనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.

ఈ యాత్రకు బయలుదేరి వెళ్లే ముందు, ఆయన చివరిసారి మీడియాతో మాట్లాడిన మాటలు ప్రజా సంక్షేమం, ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకం కోసం ఆయన పడుతున్న తపనను ప్రతిబింబించాయి. ఈ సంగతులు ఆయన మాటల్లోనే వినాలంటే.. రాష్ట్రంలో 60 వేలకుపైగా గ్రామాలున్నాయి. ఈ గ్రామాలన్నింటికీ వెళ్లడం సాధ్యపడదు. అన్నింటికి వెళ్లలేకపోయినా కొన్ని గ్రామాలకు వెళ్లైనా ప్రజలకు చేరవయ్యే ప్రయత్నం చేయవచ్చు.

వెళ్లిన గ్రామాల్లో వారి సమస్యలను అడిగి తెలుసుకొని, పరిష్కరించే అవకాశాలు కల్పించవచ్చు. అందుకే ఈ రచ్చబండ కార్యక్రమం చేపట్టాను. రోజుకు రెండు, మూడు గ్రామాల్లో పర్యటించినా తన కార్యక్రమం విజయవంతమవుతుందని వైఎస్సార్ చివరిసారి మీడియాతో వ్యాఖ్యానించారు. నెలకు రెండు, మూడు రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా... గ్రామాల్లో పరిస్థితులను తానే నేరుగా తెలుసుకునే అవకాశం వస్తుందన్నారు. అనంతరం కాసేపటికే హెలికాఫ్టర్‌లో చిత్తూర పయనమైన వైఎస్సార్ నల్లమల అడవిలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి