బాబు పాదయాత్రతో హజారే ఆత్మహత్య చేసుకుంటారేమో!!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవినీతిపై పాదయాత్ర చేసిన విషయం తెలుసుకుంటే సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆత్మహత్య చేసుకుంటారేమోనని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు.

మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి శనివారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భగా కేసీఆర్ ప్రసంగిస్తూ తొమ్మిదేళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అవినీతిపై ఏమాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. ఇపుడు అవినీతిపై పాదయాత్రలంటూ రాజధానిలో తిరిగితే సరిపోతుందా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకొద్దామని నాడు అసెంబ్లీలో విపక్ష సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టగా, దానిపై సమాధానం చెప్పకుండా పారిపోయిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. అంతేకాకుండా, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీపై బషీర్‌బాగ్ వద్ద కాల్పులు జరిపించిన ఘనాపాటి చంద్రబాబు అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమన్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తెలంగాణ పేరుతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తామన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలను అందజేస్తామన్నారు. ఇకపోతే.. పరిపాలనా సౌలభ్యం కొరకు తెలంగాణలోని 10 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తామని కేసీఆర్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి