భూ కబ్జాలపై ఎస్సీ-ఎస్టీ కమిషన్‌కు కేసీఆర్ ఫిర్యాదు

మంగళవారం, 10 నవంబరు 2009 (11:42 IST)
రాష్ట్రంలో ఆక్రమణకు గురైన దళితుల భూములపై జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్‌కు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఫిర్యాదు చేశారు. దళితుల భూములు భూకబ్జాకు గురైన ప్రాంతాల్లో ఆ కమిషన్ బృందం పర్యటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా, భూకబ్జాలకు వ్యతిరేకంగా తెరాస తెలంగాణా ప్రాంతాల్లో ధర్నాలకు దిగుతున్న విషయం తెల్సిందే.

పాపన్నపేట మండలంలో తెరాస చేపట్టిన ధర్నాను లక్ష్మీనగర్ వాసులు వ్యతిరేకించారు. తెరాస ధర్నాకు నిరసగా బంద్ పాటించారు. ఫలితంగా, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీనగర్‌లోని ఆరు వందల ఎకరాల భూములను స్థానికేతరులు ఆక్రమించారని కేసీఆర్ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.

దీనిపై తెరాస శ్రేణులు సోమవారం నుంచి ధర్నాకు శ్రీకారం చుట్టాయి. అంతేకాకుండా తెలంగాణా ప్రాంతాల్లో దళితుల భూములు కూడా భూకబ్జాకు గురయ్యాయని కేసీఆర్ ఆరోపించారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని దళితులకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క సెంటు అసైన్డ్ భూమి ఉన్నా దాని నాగలితో దున్నిస్తానని కేసీఆర్ ప్రకటించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి