మళ్లీ దీక్ష ప్రారంభించిన కొవ్వూరు ఎమ్మెల్యే

సోమవారం, 29 జూన్ 2009 (17:46 IST)
పోలీసులు అరెస్టు చేసిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.వి.రామారావు మళ్లీ దీక్ష ప్రారంభించారు. గాంధీనగర్ పోలీసులు విడుదల చేసిన వెంటనే ఆయన తన దీక్షా రంగాన్ని ఇందిరాపార్క్ వద్దకు మార్చారు.

తనపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ సోమవారం ఉదయం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షకు దిగిన విషయం తెల్సిందే. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసి, గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీస్ స్టేషన్‌లో కూడా ఆయన తన దీక్షను కొనసాగించారు. దీనికి తోడు పలువురు తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్యంగా దళిత ప్రజాప్రతినిధులు మోత్కుపల్లి నర్సింహులు, తెదేపా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.విజయ రామారావు, ఎమ్మెల్యే రామారావు భార్య, కుమార్తెలు, స్ఫూర్తి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు కూడా వచ్చి రామారావుకు సంఘీభావం తెలుపుతూ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు.

దీంతో అక్కడ కూడా పరిస్థితి ఉద్రికంగా మారడంతో పోలీసులు రామారావును కొద్దిసేపు స్టేషన్‌లో ఉంచి అనంతరం విడిచిపెట్టారు. ఇలావుండగా, తనపై అక్రమంగా అత్యాచారం, హత్య కేసులు బనాయించి మానసికంగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం బేషరతుగా వాటిని ఉపసంహరించాలని కోరారు.

అంతేకాకుండా, తనను, తన కుటుంబాన్ని రోడ్డ మీద పడేలా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, పోలీసులు క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యే రామారావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు విడుదల చేసిన అనంతరం అక్కడి నుంచే హుటాహుటిన ఇందిరాపార్క్ వద్దకు చేరుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి రామారావు మళ్ళీ ఆమరణ నిరశన దీక్షకు పూనుకున్నారు.

వెబ్దునియా పై చదవండి