మీరేం కలత చెందొద్దు: కోర్ కమిటీ దృష్టికి తీసుకెళతా!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ లభించింది. ఈ హామీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాదు. కాంగ్రెస్ కోర్ కమిటీ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన టి ఎంపీలు హైదరాబాద్‌కు పయనమయ్యారు.

ప్రధాని మన్మోహన్‌సింగ్‌‌తో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఎంపీలు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందిగా కోర్‌ కమిటీకి సూచిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు.

సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తాము చెప్పినదంతా ప్రధాని ఓపికగా ప్రధాని విన్నారన్నారు. ప్రధాని స్పందన పట్ల తాము సంతోషంగా ఉన్నట్టు కేకే తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 15వ తేదీన ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ సమయానికి తెలంగాణపై కోర్‌ కమిటీలో చర్చించాల్సిందిగా కాంగ్రెస్‌ నేతలు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.

ప్రస్తుతం తాము తమ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తిరగలేకపోతున్నామని, కనీసం శుభకార్యాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడి ఉందని ప్రధానికి చెప్పినట్టు కేకే తెలిపారు. ఉద్యమం అంత తీవ్రంగా ఉన్నా తాము కాంగ్రెస్‌ పార్టీకి విధేయులుగానే ఉన్నామని, కానీ ఇద్దరు ఎంపీలు అధిష్టానాన్ని ధిక్కరించి జగన్‌ పార్టీతో జతకట్టారని, సోనియాను సవాలు చేస్తున్నారని, ఇప్పటిదాకా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వీహెచ్‌ ప్రధానికి గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి