మేం తీసుకున్నవి ముడుపులు కాదు.. విరాళాలు : రాఘవులు

గురువారం, 9 ఫిబ్రవరి 2012 (02:02 IST)
File
FILE
ఖమ్మం జిల్లా మద్యం వ్యాపారి నుంచి తాము ముడుపులు తీసుకోలేదని, పార్టీకి విరాళాల రూపంలో నిధులు తీసుకున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు వివరణ ఇచ్చారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో సీపీఎం నాయకులు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఈనెల ప్రారంభంలో ఖమ్మంలో నిర్వహించిన ఆ పార్టీ మహా సభల కోసం ఓ మద్యం వ్యాపారి నుంచి మూడు లక్షల రూపాయల ముడుపులు తీసుకున్నట్టు ఏసీబీ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

దీనిపై రాఘవులు స్పందించారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో అసలు సమస్యలను పక్కనబెట్టి, నిజమైన దోషులను రక్షించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పార్టీ విరాళాల కోసం తమ పార్టీ నేతలు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు దగ్గరికి వెళ్లినట్లుగానే మద్యం వ్యాపారుల దగ్గరకు వెళ్లారని తెలిపారు.

ఇదంతా చాటుమాటుగా, లోగుట్టుగా జరిగేదేమీ కాదని స్పష్టం చేశారు. బహిరంగంగా తీసుకున్న ఈ విరాళాలన్నింటికీ రశీదులున్నాయని, ఎప్పటికప్పుడు ఆడిట్ కూడా నిర్వహించామని తెలిపారు. ముడుపులు తీసుకున్న వారిని, బహిరంగంగా విరాళాలు సేకరించిన వారిని ఒకే గాటన కట్టడం సరికాదని రాఘవులు అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి