మోసం చేయాలనే ఆలోచన లేదు: వైఎస్

FileFILE
ఎస్సీ వర్గీకరణ అంశంలో మాదిగలను మోసం చేయాలనే ఆలోచన తమకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో చొరవ తీసుకుంటే మరో వర్గం తమకు దూరమవుతుందని తెలిసినా తాము మాత్రం వర్గీకరణ వైపే మొగ్గు చూపామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఎమ్మార్పీఎస్ కార్యకర్త సురేందర్ మాదిగ మృతి చెందిన నేపథ్యంలో ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌తో ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాలను ఆయన కార్యాలయం ప్రెస్‌కు విడుదల చేసింది. దీని ప్రకారం వైఎస్ మాట్లాడుతూ గాంధీభవన్‌లో జరిగిన ఘర్షణ సందర్భంగా సురేందర్ మాదిగ మృతి చెందాడే తప్ప అతనిది ఆత్మాహుతి కాదని అన్నారు.

హింస ద్వారా ఏమీ సాధించలేమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆందోళనలు హింసాత్మకంగా మారితే ఉద్యమాలకు, ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానస్థాయిలో అందనప్పుడు దాన్ని సరిచేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే వర్గీకరణకు సంబంధించి మూడేళ్ల క్రితం ఓ కమిటీ వేశామని ఆయన తెలిపారు. అయితే పార్లమెంటులో సరైన బలం లేనికారణంగా, రాజ్యాంగ పరమైన సమస్యలు ఉండడంతో వర్గీకరణ సమస్య పరిష్కారం ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి