రవీంద్రనాథ్‌ కోసం కార్యకర్తల ఆమరణ దీక్షలు

ముఖ్యమంత్రి వైఎస్ బావమరిది, కడప మేయర్ అయిన రవీంద్రనాథ్‌రెడ్డికి కడప అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతూ మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు ఆమరణ దీక్షలు ప్రారంభించారు. రవీంద్రనాథ్‌రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇచ్చేవరకు తాము దీక్ష విరమించబోమని వారు ప్రకటించారు.

ఈ విషయమై దీక్ష ప్రారంభించిన కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ రవీంద్రనాథ్‌కు టికెట్ ఇవ్వకుంటే తాము ఒప్పుకోమని అన్నారు. రవీంద్రనాథ్‌కు టికెట్ ఇస్తున్నట్టు అధిష్టానం ప్రకటన చేస్తేనే తాము దీక్ష విరమిస్తామంటూ వారు పేర్కొన్నారు.

కడప మేయరుగా ఉన్న రవీంద్రనాథ్‌రెడ్డి కడప అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగాలని భావించారు. దీనికోసం ఆయన అధిష్టానానికి దరఖాస్తు కూడా చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రవీంద్రనాథ్‌రెడ్డికి అసెంబ్లీ టికెట్ రావడం కష్టమని తేలిన తరుణంలో ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఈ విషయమై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన తనకు టికెట్ కేటాయించకపోతే ఎలా అని ప్రశ్నించారు. కడప టికెట్టు తనకు కేటాయించకుంటే స్వతంత్రంగా బరిలో దిగేందుకు సైతం తాను సిద్ధమని అన్నారు. నియోజకవర్గ కార్పొరేటర్లు, కార్యకర్తలు తనపై ఒత్తిడి తెస్తున్నారని అందుకే తాను ఈ విషయంలో వెనకడుగు వేయబోనని ఆయన అన్నారు.

తనకు టికెట్ కేటాయించకుండా అధిష్టానం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే స్వతంత్రంగా బరిలో దిగినా తనను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి