రాఖీ కానుకగా "అభయహస్తం": వైఎస్సార్

FILE
రాష్ట్రంలోని ఆడపడుచులకు రాఖీ పర్వదిన సందర్భంగా "అభయహస్తం" పథకాన్ని అమలుచేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు.

స్వయం సహాయక బృందాల్లో 60 ఏళ్లు పైబడిన ఆడపడుచులకు ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగి జీతంలాగా రూ. 500 నుంచి రూ.2,200 వరకు అందించే ఆత్మీయ నేస్తమే అభయహస్తమని వైఎస్సార్ పేర్కొన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కోటి మంది మహిళలకు అభయహస్తం పత్రాలను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.

తాను అధినేతను కానని, ఆడపడుచులకు అన్నయ్యనేనని ముఖ్యమంత్రి అన్నారు. రాఖీపండుగ ఆత్మీయతకు ప్రతీక అని, అన్నదమ్ముల పట్ల ఆడపడుచుల అనురాగానికి ఈ పర్వదినం ఓ గుర్తని వైఎస్సార్ వెల్లడించారు. ఆడపడుచులను ఆదరించడం ఆచారమని, త్రికరణశుద్ధిగా పాటించాల్సి సత్సంప్రదాయం రాఖీ పండుగ అని ముఖ్యమంత్రి వివరించారు.

అందుకే రాష్ట్రంలోని తన ఆడపడుచులకు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టానని, పావలావడ్డీ ఆసరాతో పటిష్టమైన జీవితాన్ని ఏర్పరుచుకున్న తన ఆడపడుచులను చూస్తే ఓ అన్నయ్యగా ఎంతో గర్వంగా ఉందని వైఎస్సార్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి