రామ్ చరణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదు : బాలకృష్ణ

గురువారం, 3 నవంబరు 2011 (17:42 IST)
ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు యువహీరో, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్‌ను ఉద్దేశించి చేసినవి కావని యువరత్న బాలకృష్ణ స్పష్టం చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశానో వారికి బాగా తెలుసని ట్విస్ట్ పెట్టారు.

'శ్రీరామరాజ్యం' ఆడియో విడుదల సమయంలో బాలకృష్ణ చాలా దురుసుగా మాట్లాడిన విషయం తెల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమను కించపరిచి మాట్లాడితే పళ్లురాలగొడతానంటూ హెచ్చరిక చేశారు. అంతకుముందు తమిళ హీరో సూర్య నటించి విడుదలైన 'సెవెన్త్ సెన్స్' ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్.. తెలుగులో ఇలాంటి చిత్రాలు రాకపోవడానికి సరైన దర్శకులు లేరంటూ వ్యాఖ్యానించారు.

దీంతో రామ్ చరణ్‌ను ఉద్దేశించే బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీనిపై బాలకృష్ణ గురువారం వివరణ ఇచ్చారు. తాను చెర్రీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను ఎవరు కించ పరిచారో వారినుద్దేశించి తాను ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు చెప్పుకొచ్చారు.

పైపెచ్చు.. తెలుగు చిత్ర పరిశ్రమలో తాను ఇద్దరు వ్యక్తులను గౌరవిస్తానని చెప్పారు. వారిలో చిరంజీవి, మోహన్‌బాబులు ఉన్నారన్నారు. ఎందుకంటే తమకు కష్టమంటే ఏంటో తెలుసున్నారు. తామంతా కష్టపడి పైకి వచ్చినట్టు గుర్తు చేశారు. వీరిద్దరితోనే కాకుండా వీరి కుటుంబాలతోనూ తాను సన్నిహితంగా ఉంటానని బాలకృష్ణ చెప్పారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ భాషలో నిర్మించని చిత్రాలను తెలుగులో నిర్మించడం జరిగిందన్నారు. అలాంటి చిత్రపరిశ్రమను కించ పరిస్తే మాత్రం తాను సహించజాలనన్నారు. పైపెచ్చు.. తను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా.. ముఖాన్నే చెప్పడం తన నైజమన్నారు.

ఇకపోతే.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. తెలుగువారంతా కలిసి ఉన్న విషయాన్నే చెప్పానని గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి