రాష్ట్రంలో ధరలు తక్కువగానే ఉన్నాయ్: వైఎస్

సోమవారం, 10 ఆగస్టు 2009 (12:06 IST)
File
FILE
ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు తక్కువగానే ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన సభా కార్యక్రమంలో నిత్యావసర సరుకుల ధరల అంశం చర్చకు వచ్చింది.

దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటం సహజమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఆ విషయానికొస్తే స్వాతంత్ర్యం వచ్చినపుడు ఉన్న ధరలు ఇపుడు ఉన్నాయా అంటూ ప్రతిపక్ష సభ్యులను వైఎస్ ప్రశ్నించారు.

కందిప్పు ధర ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే తక్కువగా ఉందన్నారు. కందిపంట దిగుబడి ఎక్కువగా ఉండే మహారాష్ట్రలోనే కేజీ కందిపప్పు ధర రూ.74గా ఉండగా, మన రాష్ట్రంలో రూ.70గా ఉందని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్ తొలగిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎలా సమకూరుతాయని వైఎస్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలోని ధరల కంటే తెదేపా పాలనలోనే ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్.గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి