రాష్ట్రంలో భారీ వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తం!

సోమవారం, 9 నవంబరు 2009 (15:07 IST)
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు.. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి.

తెలంగాణాలో కూడా అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం ఓ మోస్తారు వర్షం పడింది. ఈ అల్పపీడ ద్రోణి కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఇకపోతే.. గత నాలుగైదు రోజులుగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

ఫలితంగా నెల్లూరు జిల్లాలో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాలకు వాహన రాకపోకలను నిలిపి వేశారు. అనేక గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో వందలాది ఎకరాలు నీటిలో మునిగి పోయాయి. మరోవైపు తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి