రిలయన్స్ ప్రతినిధిగా చంద్రబాబు: మంత్రి రఘువీరా

శనివారం, 9 జనవరి 2010 (13:51 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నట్టుగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులకు పైగా రాష్ట్రం తగలబడి పోతుంటే కంటికి కూడా కనిపించని చంద్రబాబు.. రిలయన్స్ సంస్థపై దాడి జరిగిన వెంటనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

రిలయన్స్‌పై జరిగిన దాడులను ప్రతి ఒక్కరూ ఖండించి తీరాల్సిందేనన్నారు. అయితే, రాష్ట్రంలో అంతకుమించి దాడులు జరిగితే స్పందించని చంద్రబాబు.. ఒక కంపెనీపై జరిగిన దాడులపై స్పందించడం ఏమేరకు సబబని ఆయన ప్రశ్నించారు. అంటే, రిలయన్స్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టుగా ఉందన్నారు.

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో ప్రజా జీవితం స్తంభిస్తే బాబు పెదవి విప్పక పోవడానికి కారణం ఏమిటన్నారు. అలాగే, పరిటాల రవి హత్య అనంతరం రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టింది చంద్రబాబు కాదా అని రఘువీరా సూటిగా ప్రశ్నించారు. రిలయన్స్‌పై జరిగిన దాడులను తాము తప్పుబడుతున్నామని, ఇలాంటి వాటిని ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా సమర్థించబోరన్నారు.

ఇకపోతే.. రాష్ట్రంలో ఏ చిన్నపాటి సంఘటన చోటు చేసుకున్నా దానికి ముఖ్యమంత్రి రోశయ్య, ప్రభుత్వ సలహాదారు కెవీపీ.రామచంద్రరావు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిలకు ఆపాదించడం చంద్రబాబు కుటిల రాజకీయాలకు నిదర్శనమన్నారు.

వైఎస్ దుర్మరణంపై వచ్చిన కథనాలకు ఆయన అభిమానులు సహనం కోల్పోయి దాడులకు పాల్పడ్డారే గానీ మరొక ఉద్దేశంతో కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాగే, వైఎస్ మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత సీబీఐదేనన్నారు.

వెబ్దునియా పై చదవండి