వరద సహాయక చర్యల్లో సర్కారు విఫలం: చంద్రబాబు

గురువారం, 8 అక్టోబరు 2009 (10:59 IST)
వరద బాధితులను ఆదుకోవడంలోనూ, సహాయ చర్యలు చేపట్టడంలోనూ రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వరద జిల్లాల్లో చేపట్టిన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్‌లో ఆయన పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెను వరదల వల్ల చనిపోయిన, కొట్టుకువచ్చిన జంతు కళేబరాలను, బురదను తొలగించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆయన దుయ్యబట్టారు. సర్వం కోల్పోయి ఉన్న వరద బాధితులకు కనీస వసతులు కూడా కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.

గత వారం రోజులుగా పస్తులు ఉంటున్న బాధితులు పిడికెడు మెతుకుల కోసం ఆర్తనాదాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర వంటి నదుల కరకట్టలను కాపాడటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని ఆయన ఆరోపించారు.

గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా యంత్రాంగాన్ని అస్తవ్యస్తం చేసిందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ తరపున 33 సహాయ బృందాలు వరద బాధిత జిల్లాల్లో పాల్గొని వున్నాయని చంద్రబాబు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి