విప్‌ను ధిక్కరించిన వారిపై అనర్హత వేటు : సీఎం కిరణ్

శనివారం, 10 డిశెంబరు 2011 (16:12 IST)
తన ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన జగన్ వర్గానికి చెందిన సొంత పార్టీ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై సీఎల్పీ ఒక నిర్ణయానికి వచ్చి స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తుందన్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ చర్య తీసుకుంటుందన్నారు.

సోనియా, ఆజాద్‌లతో జరిపిన చర్చల్లో ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి పథకాలపై చర్చించినట్టు చెప్పారు. ఇకపోతే.. తెలంగాణ అంశంపై సంప్రదింపులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయిన తర్వాతే ఓ నిర్ణయం వెలువడచ్చన్నారు. అధిష్టానం అనుమతిస్తేనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. అలాగే, కష్టకాలంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రరాపా అధినేత చిరంజీవికి మంచి పదవిని ఇస్తామన్నారు. అదేవిధంగా కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి