సంక్రాంతి పండుగ తర్వాత మంత్రి డీఎల్ రాజీనామా?!

File
FILE
సంక్రాంతి పండుగ తర్వాత తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని రాష్ట్ర మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి భావిస్తున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలియవచ్చింది. ఇందుకోసం ఆయన ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమచారం. అయితే, ఈనెల 20వ తేదీ వరకు తాను నగరంలో అందుబాటులో ఉండనని, 21, 22, తేదీల్లో వచ్చి కలవాలని సూచించినట్టు తెలుస్తోంది.

కడప జిల్లాకు చెందిన మంత్రి డీఎల్, యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యుల మధ్య సవాల్ ప్రతిసవాళ్లు జరుగుతున్న విషయం తెల్సిందే. జగన్ వర్గానికి చెందిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డీఎల్ డిమాండ్ చేశారు. పార్టీ బ్యానర్‌, సోనియా ఫోటో కాకుండా మీరు ఒక్క వైఎస్‌ బొమ్మతోనే గెలిచి ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.

కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలతో పాటు.. తమతమ స్థానాలకు వైఎస్ బొమ్మతో మీరు ఎన్నికల్లో పోటీ చేయండి, తాను వైఎస్‌ బొమ్మ లేకుండా కాంగ్రెస్‌ బ్యానర్‌పై, సోనియా ఫోటో పెట్టుకుని పోటీ చేస్తానని డీఎల్ ప్రకటించారు. దీనికి జగన్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి కూతవేటు దూరంలో నిలబడి (జలదీక్ష) సమాధానం ఇచ్చారు.

తొలుత మీరు రాజీనామా చేయండి, ఆ వెంటనే మేము రాజీనామాలు చేస్తామని, ఆ తరువాత ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుందామని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్‌ నాథ్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు ఢిల్లీ జల దీక్షలో సవాలు చేశారు.

అంతేకాకుండా, రాజీనామా చేసే వేదిక, సమయం నిర్ణయిస్తే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనికి డీఎల్ కూడా వెంటనే స్పందించారు. వేదిక అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయమేనని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మంత్రి డీఎల్.. డిప్యూటీ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరడం ప్రతి ఒక్కరినీ ఉత్కంఠతకు గురిచేస్తోంది. రాజీనామా సమర్పించేందుకే నాదెండ్లను డీఎల్ కలువనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం కడప రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

వెబ్దునియా పై చదవండి