సబితా ఇంద్రారెడ్డి శాఖ మార్పు - హోం మంత్రిగా శ్రీధర్ బాబు?!!

బుధవారం, 10 ఏప్రియల్ 2013 (17:52 IST)
File
FILE
జగన్ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి శాఖ మార్పు అనివార్యంగా కనిపిస్తుండగా, రాష్ట్ర హోం మంత్రి పగ్గాలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ మంగళవారం చార్జిషీటును దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఇందులో ఏ-1గా జగన్, ఏ-2గా విజయసాయి రెడ్డి, ఏ-4గా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లను పేర్కొన్నారు. దీంతో సబితా ఇంద్రారెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కిరణ్ సర్కారు విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. వీటిని తిప్పి కొట్టేందుకు వీలుగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నడుంబిగించినట్టు తెలుస్తోంది. సబిత రాజీనామా చేస్తే ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, పదవిలో కొనసాగితే విపక్షాల చేతికి ఆయుధాలిచ్చినట్టవుతుందని భావిస్తున్నారు. దీంతో మధ్యేమార్గంగా శాఖ మార్పునకు ఆయన మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

అదేసమయంలో హోంమంత్రి పదవి ఖచ్చితంగా తెలంగాణ వ్యక్తికే కేటాయించాల్సి రావడంతో ఆ ప్రాంతానికి చెందిన మంత్రి డి. శ్రీధర్ బాబు పేరు తెరపైకి వచ్చింది. శ్రీధర్ బాబు యువకుడు, ఉన్నత విద్యావంతుడు, చురుకైన వ్యక్తే కాకుండా, సీఎంకు అత్యంత సన్నిహితుడు కావడం కలిసొచ్చే అంశం. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీధర్ బాబుకే హోం మంత్రి ఛాన్సు దక్కడం ఖాయమని రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి