హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సబిత

దేశంలో తొలి మహిళా హోంమంత్రిగా నియమితులై సరికొత్త రికార్డును సృష్టించిన సబితా ఇంద్రారెడ్డి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని జె బ్లాక్‌లో 8 అంతస్తులోని హోం మంత్రిత్వ శాఖ ఛాంబర్‌లో ఈ ఉదయం 11.30 గంటలకు ఆమె అధికార పగ్గాలు చేపట్టారు.

గతంలో హోం మంత్రిగా పని చేసిన కె.జానారెడ్డి కూడా ఇదే ఛాంబర్‌నే ఉపయోగించగా, సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ ఛాంబర్‌నే ఎంచుకోవడం గమనార్హం. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో మహిళల సంఖ్యను పెంచడం తన ప్రధాన కర్తవ్యమన్నారు. అలాగే, మహిళలపై దాడులు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటానని సబితా తెలిపారు.

సచివాలయానికి కొత్త మంత్రుల తాకిడి
గురువారం శుభముహుర్తం కావడంతో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార మంత్రి గీతారెడ్డి, మున్సిపల్‌ మంత్రి ఆనం రాంనారాయణ్‌రెడ్డి, గృహ నిర్మాణ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఆరోగ్య మంత్రి డి.నాగేందర్‌, మార్కెటింగ్‌ మంత్రి రాజనర్సింహా తదితరలు తమకు కేటాయించిన బ్లాకుల్లో కొత్త పదవి బాధ్యతలను స్వీకరించారు. కొత్త మంత్రుల రాకతో సచివాలయానికి సరికొత్త శోభ చేకూరింది.

వెబ్దునియా పై చదవండి