1994 పరిణామాలపై పుస్తకం: దగ్గుబాటి

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994 ఆగస్టులో చోటుచేసుకున్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ పుస్తకాన్ని తయారుచేశారు. ఒక చరిత్ర - కొన్ని నిజాలు (అదర్‌సైడ్ ఆఫ్ ట్రూత్) అనే పేరుతో సిద్ధమైన ఈ పుస్తకాన్ని ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు విడుదల చేస్తానంటూ ఆయన పేర్కొన్నారు.

సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, ఎమ్మెల్సీలు కనుకుల జనార్ధన రెడ్డితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన దగ్గుబాటి పలు ఆసక్తికరమైన అంశాలను ప్రజలముందుంచారు. 1994 ఆగస్టులో చోటు చేసున్న పరిణామాల్లో భాగంగా తాను చంద్రబాబు పక్షం వహించడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. ఆరోజుల్లో తాను చంద్రబాబుతో కలవడాన్ని తన సతీమణి పురంధేశ్వరి తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన పేర్కొన్నారు.

ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నడుచుకోవద్దని తన భార్య, చిన్న బావమరిది జయశంకర్‌కృష్ణ తనను కోరారని అన్నారు. అయితే తాను ఎవరిమాటా వినకుండా వైస్రాయ్ హోటల్‌కు వెళ్లానని ఆయన వివరించారు. అప్పట్లో రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఒక్కో ఎమ్మెల్యే రూ.ఐదు లక్షలు, మంత్రులు రూ. ఏడున్నర లక్షలు తీసుకున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అలాగే అప్పట్లో చంద్రబాబుపై నన్నపనేని రాజకుమారి తీవ్రంగా ధ్వజమెత్తారని కూడా ఆయన గుర్తుచేశారు.

వెబ్దునియా పై చదవండి