చేపల్లోకెల్లా పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చేపల రుచే వేరు. ఈ చేపలను ఒక్కసారి తింటే జీవితాంతం మరచిపోలేరు. అందుకే ఈ పులస చేపల ధర చాలా ఖరీదుగానే ఉంటుంది. అందుకే తమ వలలో ఒక్క పులస చేపపడితే చాలని జాలర్లు తమ ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తుంటారు.
తాజాగా గోదావరి నది వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో పులస చేపలు గోదావరి నది నీటికి ఎదురీదుతూ.. జాలర్ల వలకు చిక్కుతున్నాయి. దీంతో యానాం మార్కెట్‌లో వాటి విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. మంగళవారం మార్కెట్‌లో రెండు కిలోల పులస చేపను వేలం వేశారు. ఇది కనీవినీ ఎరుగని రీతిలో ధర పలికింది.
ఒక్క పులస చేప ఏకంగా రూ.19 వేల ధరకు అమ్ముడుపోయింది. ఈ చేపను పార్వతి అనే మహిళ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఈ చేపను భైరవపాలెంకు చెందిన ఓ వ్యక్తికి రూ.20 వేలకు విక్రయించారు. ఈ సీజన్‌లో లభించిన పులస చేపల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన ధర ఇదేనని యానాం వ్యాపారులు అంటున్నారు.
కాగా, ఐ పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేయడం వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు చాలా తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇదే చేప సముద్రంలో లభిస్తే మాత్రం దీన్ని వలస చేప అని అంటారు.