ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం మరో రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటన మరచిపోకముందే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో రెండు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ఏ ఒక్కరూ మరణించలేదు. ఈ వివరాలను పరిశీలిస్తే..
ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు దగ్గర పాలేరు వంతెనను డీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టి వాగులో పడిపోయింది. దీంతో ఆ బస్సులో ప్రయాణించే 70 మంది విద్యార్థులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ విద్యార్థులందరు యాగంటి, మహానంది విహారయాత్రకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా ఉవలపాడు మండలం కరేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినవారని గుర్తించారు.
అలాగే, జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. మహిళా ఉద్యోగులతో వెళ్తున్న ఓ బస్సును విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న వెంకటేశ్వర ట్రావెల్స్ వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.