గ్రామ సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు: జగన్

బుధవారం, 2 అక్టోబరు 2019 (13:50 IST)
గ్రామ సచివాలయాల ద్వారా 500రకాల సేవలు జనవరి నుంచి అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ ఉద్ఘాటించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 4లక్షల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.

బుధవారం కరపలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన జగన్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవకతవకలకు ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగుల నియామకం చేపట్టామని అన్నారు. సచివాలయ ఉద్యోగులకు అనుసంధానంగా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.

గ్రామ సచివాలయాల ద్వారా 500రకాల సేవలు జనవరి నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి 50ఇళ్లకు గ్రామ వాలంటీర్ పెద్ద కొడుకులా సేవలు చేస్తాడని జగన్ అన్నారు. 

‘‘గత ఐదేళ్లలో ఏ పనికైనా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. తమ కార్యకర్తలకే జన్మభూమి కమిటీలు ప్రాధాన్యత ఇచ్చేవి. అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలు చేరుస్తాం. గ్రామ సచివాలయం పక్కన ఎరువులు-విత్తనాల కేంద్రం ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ పనిముట్ల వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తాం. ఆక్వా రంగానికి చెందిన వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తాం’’ అని జగన్ అన్నారు.

‘‘అభివృద్ధిలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లది కీలకపాత్ర. మళ్లీ గెలిచేలా పాలన ఉండాలని సచివాలయ ఉద్యోగులు గుర్తుంచుకోవాలి. మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో మౌలికవసతులు కల్పిస్తాం. స్కూళ్లు, పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పులు తీసుకొస్తాం. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం.

రాష్ట్రంలో 43 వేల బెల్ట్‌ షాపులు తొలగించాం. 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్లు ఇస్తాం. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ అన్నారు.

రాష్ట్రంలో ఇసు క కొరతను పరిష్కరించేందుకు రీచ్‌లన్నీ తక్షణమే ఓపెన్‌ చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘రాష్ట్రంలో అవసరాలకు తగినంత ఇసుక లేదు. ఇది అధికారులు గుర్తించి అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలి. ఇసుక విధానంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం.

ఇసుక కొరతపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. ఇదే సమయంలో పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు. ఇసుక రవాణాకు ఎవరు ముందుకొస్తే వారిని తీసుకోవాలన్నారు.

కిలోమీటరుకు రూ.4.90 చొప్పున ఎవరు ముందుకొచ్చినా రవాణా కోసం వారి వాహనాలను వాడుకోవాలని సూచించారు. జిల్లాల్లో ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యత జాయింట్‌ కలెక్టరు స్థాయి అధికారిదేనని స్పష్టం చేశారు.

ఈ అధికారి ఇసుక రవాణా, సరఫరా బాధ్యతలను మాత్రమే పర్యవేక్షించాలని చెప్పారు. నదుల్లో వరదలు తగ్గాయని, ఇసుక అందుబాటులోకి వచ్చిందని, ఇక సరఫరాలో లోటుపాట్లూ ఉండకూడదని తెలిపారు. 60 రోజుల్లో మార్పు కనిపించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు