అమితాబ్ నివాసంలో కూలిన వృక్షం..తీవ్ర విషాదంలో అమితాబ్.. ఎందుకో తెలుసా?

సోమవారం, 6 జులై 2020 (09:15 IST)
ముంబయిలో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో కూడా ఓ గుల్ మొహర్ చెట్టు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయింది.

ముంబయిలో అమితాబ్ నివాసం పేరు ప్రతీక్ష. అమితాబ్ తండ్రి, ప్రముఖ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన ఓ కవిత పేరు ప్రతీక్ష. అమితాబ్ దాన్నే తన నివాసం పేరుగా పదిలపరుచుకున్నాడు.
 
ఆ ఇంట్లో ఎంతో ముచ్చపడి నాటిన గుల్ మొహర్ చెట్టు అంటే అమితాబ్ కు అపారమైన ప్రేమ. ఆ చెట్టుతో ఎన్నో ఆత్మీయ, అపురూప క్షణాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడా చెట్టు నేలకొరగడంతో ఆయన బాధ వర్ణనాతీతం. తన విచారాన్ని బ్లాగ్ లో రాశారు.

'తన జీవితకాలం ఆ చెట్టు మాకు సేవలు అందించింది. చివరికి స్వచ్ఛందంగా తలవాల్చింది. వేళ్లతో సహా పెకలించుకు వచ్చింది. ఆ గుల్ మొహర్ చెట్టుతో 43 ఏళ్ల అనుబంధం ఉంది. 1976లో ముంబయిలో మా మొదటి ఇల్లు ప్రతీక్ష. ఆ ఇంట్లో చేరిన సమయంలో మొక్కగా ఉన్నప్పుడు దాన్ని నాటాం.

మా ఇంట్లో ఏ శుభకార్యం అయినా, పండుగ అయినా, వేడుక అయినా ఆ చెట్టు వద్దే జరిగేవి. ఆ చెట్టు వద్ద ఆడుకుంటూనే పిల్లలు పెద్దవాళ్లు కూడా అయ్యారు. అంతెందుకు, 2007లో మా అబ్బాయి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి కూడా ఆ చెట్టు కిందే జరిగింది.

ఎన్నో మధురానుభూతులను పెనవేసుకున్న ఆ చెట్టు కొమ్మలు వయోభారంతో నేలకొరిగిన క్షణాన ఇంట్లో పెద్దవాళ్లు పోయినంత బాధ కలుగుతోంది' అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు