జగన్‌కు షాక్... రాజధాని రైతులు జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు...

బుధవారం, 9 మార్చి 2016 (21:10 IST)
అసెంబ్లీలో హీట్ రేకెత్తించిన అమరావతి భూ సమీకరణ వ్యవహారంలో అధికార పక్షాన్ని ఇరుకునపెట్టిన జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని రైతులు గట్టి షాకే ఇచ్చారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజధాని లోని తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం నుంచి మందడం గ్రామం వరకు జగన్ దిష్టిబొమ్మను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. 
 
ఈ ఊరేగింపులో 29 గ్రామాలకు చెందిన సుమారు 1000 మందికి పైగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా ఊరేగింపుగా వచ్చిన రైతులు జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. 
 
జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలనీ, తమ వద్ద ప్రభుత్వం భూములను లాక్కోలేదనీ, తామే ఇష్టపూర్వకంగా ఇచ్చినట్లు తెలిపారు. అలాగే రాజధానికి ఇచ్చిన భూములు పోగా మిగిలిన భూములను తమకు అమ్ముకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే దానిని లేకుండా చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ వారు మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి