రాజధాని అమరావతి నిరసనలు 88వ రోజుకు చేరుకున్నాయి. 'జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నాలు 88వ రోజుకు చేరాయి.
వెలగపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పెదపరిమి, రాయపూడి, కృష్ణాయపాలెంలో ధర్నాలు నిర్వహించారు. 'జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ అమరావతి ప్రజలు నినాదాలు చేస్తున్నారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలిపారు.
మూడు నెలలు తాము ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. ‘‘ఇక ఎవరినీ నమ్మలేం. న్యాయస్థానాలే మాకు దిక్కు. న్యాయమూర్తులే దేవుళ్లు’’ అని నినదించారు. మూడు రాజధానుల నిర్ణయం ప్రభుత్వం మార్చుకునే వరకు ప్రాణాలు అర్పించి ఆయినా పోరు సాగిస్తాం తప్ప వెనకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞ చేశారు.
అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో పెదపరిమికి చెందిన మహిళలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అమరావతితోనే మా భవిత, రాష్ట్ర భవిష్యత్తు అని చేతులపై గోరింటాకు పెట్టుకుని రాయపూడి మైనారిటీ మహిళలు, రైతు కూలీలు నినాదాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన పదినెలల్లో కొత్తగా ఒరిగింది ఏమీలేదని.. జగన్ పాలనలో అతుకుల బతుకుగా మారిందంటూ చిల్లుల గిన్నెలు ముఖానికిఅడ్డుపెట్టుకొని తుళ్లూరు మహిళలు నిరసన వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతిపై సీఎం జగన్ మొండివైఖరి మార్చుకోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వేంకటేశ్వరరావు మాదిగ కోరారు. ఉద్దండ్రాయునిపాలెంలో ఏప్రిల్ 8న దళిత, బహుజన ధర్మ పోరాట దీక్ష చేపడతామని చెప్పారు. రైతుల న్యాయ పోరాటాన్ని అణచివేయాలనే దురుద్దేశంతో ప్రభుత్వమే పోటీగా బిర్యానీ ఉద్యమాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో నేత రఫీ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయస్థానాలు జగన్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నా ఆయనలో మార్పు రావడం లేదని విమర్శించారు. ఎంపీ నందిగం సురేశ్ అమరావతికి ద్రోహం చేస్తున్నారని గుంటూరు బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కంతేటి బ్రహ్మయ్య మండిపడ్డారు.
రోజుకు మహిళలకు రూ.500, పురుషులకు రూ.700, మద్యం ఇస్తూ బయట ప్రాంతాల నుంచి మనుషులను ఇక్కడి తరలించి అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ, కోడి, చేప, రొయ్య కూరలతో ఎక్కువ రోజులు ఆందోళన చేయలేరని ఎద్దేవా చేశారు.