అమరావతి మునుగుతుందా.. నా మూడున్నరెకరాలు నీకే... బొత్సకు మహిళ సవాల్

మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:42 IST)
ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు అమరావతి ప్రాంతానికి చెందిన ఓ మహిళ బహిరంగ సవాల్ విసిరింది. భారీ వరదలు వస్తే అమరావతి మునిగిపోతుదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ గత కొన్ని రోజులుగా ఊకదంపుడు ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.
 
దీనిపై అమరావతికి చెందిన ఓ మహిళ బహిరంగ సవాల్ విసిరింది. రాజధాని ప్రాంతం వరదలకు మునిగిందని మంత్రి బొత్స నిరూపించగలరా? అని ప్రశ్నించారు. రాజధాని మునుగుతుందని నిరూపిస్తే.. తనకు తన పుట్టింటి వాళ్లు ఇచ్చిన మూడున్నర ఎకరాల స్థలాన్ని బొత్స సత్యనారాయణకు రాసిస్తానని సవాల్ విసిరారు. బాధ్యత గల మంత్రి బొత్స.. అమరావతి భూములు రాజధానికి అనుకూలం కాదు అని ఆనాడే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు.
 
ఇటీవల మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన వరదల కారణంగా కృష్ణానదికి భారీగా వరదలు వచ్చాయి. దీంతో అనేక లంక గ్రామాలు నీట మునిగాయి. వీటిని బూచిగా చూపి.. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాన్ని అమరావతి నుంచి దొనకొండ ప్రాంతానికి మార్చాలని వైకాపా ప్రభుత్వం భావిస్తుంటే, స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూములు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ఇక్కడ నిర్మాణాలకు భారీ వ్యయం అవుతుందని పేర్కొన్నారు. గతంలో వచ్చిన వరదల సమయంలో అమరావతి ప్రాంతం పూర్తిగా జలమయం అయిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి బొత్సకు ఓ మహిళ సవాల్ విసిరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు