చంద్రబాబు 100 డేస్ పాలనపై అంబటి రాంబాబు విసుర్లు!

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (07:46 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలనపై వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. బాబు వంద రోజుల సినిమా పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. 
 
బాబు వంద రోజుల సినిమా ప్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యకరమని అంబటి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ రాజధానిగా అందరికీ సమ్మతమేనని అయితే, చర్చ లేకుండా ప్రకటన చేయడమే సరికాదన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. వంద రోజులైనా రుణమాఫీపై సంతకం పెట్టలేదన్నారు. 
 
ఎన్నికల మేనిఫెస్టోలో బాబు 200 వాగ్దానాలు చేశారని, పాదయాత్రలో మరో మూడు వందల వాగ్దానాలు చేశారని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎక్కడైనా అమలయిందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.2కే మినరల్ వాటర్ ఎవరైనా ఇప్పటిదాకా తాగారా చెప్పాలని అంబడి అడిగారు. 

వెబ్దునియా పై చదవండి