ఏపీలో 439 కరోనా కేసులు : పేదలకు మాత్రమే ఉచితం ... సుప్రీంకోర్టు

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (20:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సోమవారం కూడా మరికొన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 439కి చేరింది. 
 
సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన 'కోవిడ్-19' పరీక్షల్లో కొత్తగా గుంటూరులో 3, నెల్లూరులో 4 కేసులు నమోదైనట్టు తెలిపింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 439కి పెరిగిందని పేర్కొంది. జిల్లా వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపూరంలో 15, చిత్తూరులో 23, ఈస్ట్ గోదావరి 17, గుంటూరు 93, కడప 31, కృష్ణ 36, కర్నూలు 84, నెల్లూరు 56, ప్రకాశం 41, విశాఖపట్టణం 20, వెస్ట్ గోదావరి 23 కేసులు నమోదు కాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతవారం పేర్కొన్న సుప్రీంకోర్టు తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని స్పష్టంచేసింది. ఎవరెవరికి ఉచితంగా కరోనా టెస్టులు వర్తింపజేయాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించింది. 
 
కొన్నిరోజుల కిందట అందరికీ ఉచితంగా కరోనా టెస్టులు అందబాటులోకి తేవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనగా, తాము ఉచితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేమని ప్రైవేటు ల్యాబ్‌లు స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం తన నిర్ణయాన్ని సవరించుకుంది. 
 
'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్దిపొందుతున్నవారు, బలహీన వర్గాల కేటగిరీలో ప్రభుత్వ గుర్తింపు పొందినవారు అర్హులుగా భావించి వారికి ఉచిత కరోనా నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలి' అని వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు