ఏపీ శాసనసభ తొలి ఫలితం వెలువడేది ఎపుడంటే...

బుధవారం, 22 మే 2019 (17:08 IST)
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారరం వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు గురువారం (మే 23వ తేదీ) చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 
 
ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పందిస్తూ, ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు.
 
ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12 గంటలలోపు ట్రెండ్స్ తెలిసిపోతాయన్నారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని, ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు బెల్ ఇంజనీర్లు సిద్ధంగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఓట్ల లెక్కింపులో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 25 మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రతతో అదనంగా మరో 10 కంపెనీల బలగాలు కూడా వచ్చాయని తెలిపారు. 
 
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా వీవీప్యాట్‌ స్లిప్స్‌ను ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని అనుసరించనున్నట్టు చెప్పారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం రావొచ్చని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. వీవీప్యాట్స్ స్లిప్పుల లెక్కింపు తర్వాత తుది ఫలితం వెల్లడిస్తామని గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు