విభజన అంశం : రామ్మోహన్ నాయుడు వర్సెస్ జితేందర్ రెడ్డి

గురువారం, 26 నవంబరు 2015 (17:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం మరోమారు లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను విభిజించేటప్పుడు తమ అభిప్రాయం వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని, రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు కేంద్రం పెద్దన్నయ్యలా జోక్యం చేసుకుంటుందన్నారు. రెండుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తాను వచ్చానని విభజన వల్ల తాము సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. సమాఖ్య వ్యవస్థను సమర్థంగా ముందుకు నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
 
ఆ సమయంలో తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి అడ్డుపడ్డారు. ఉప సభాపతి జోక్యంతో కొద్దిసేపు మిన్నకుండినప్పటికీ.. ఆ తర్వాత ఆయన సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణపై ఎవర్నీ దూషించాల్సిన పని లేదన్నారు. విభజన సహేతుకమైనదేనని అన్నారు. అందుకు నిదర్శనం వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి లభించిన మెజారిటీయేనని చెప్పారు. పైసా ఖర్చు చేయకున్నా తమ పార్టీ అభ్యర్థికి అఖండ మెజారిటీ కట్టబెట్టారని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి