ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.54,475 కోట్లు: శివరామ కృష్ణన్

శనివారం, 30 ఆగస్టు 2014 (11:26 IST)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి రూ.54,475 కోట్లు అవసరమని శివరామ కృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు అందజేసిన తన నివేదికలో ఈ ప్రతిపాదనలను కూడా కమిటీ నివేదించినట్లు సమాచారం. 
 
ఈ నిధుల్లో ఏఏ పనులకు ఎంతెంత నిధులు అవసరమవుతాయన్న అంశాన్ని కూడా కమిటీ పేర్కొంది. తాగు నీరు, మౌలిక వసతులు, డ్రైనేజీ నిర్మాణానికి రూ. 1,536 కోట్లు, రాజ్ భవన్, సచివాలయం కోసం వరుసగా రూ. 56, రూ. 68 కోట్లు, 8 రైల్వే జోన్ల నిర్మాణం కోసం రూ.7,035 కోట్లు అవసరమని తెలిపింది. 
 
ప్రభుత్వ అతిథి గృహాలు, డైరెక్టరేట్ల నిర్మాణం కోసం వరుసగా రూ. 559 కోట్లు, 6,658 కోట్లు అవసరమని, రాజధానిలో ఇతర భవనాల నిర్మాణం కొసం రూ. 27,092 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. 
 
విమానాశ్రయాల అభివృద్ధి కోసం రూ. 10,200 కోట్లు అవసరం కానుండగా, హైకోర్టు, న్యాయవ్యవస్థ నిర్మాణాల కోసం రూ. 1,271 కోట్లు కావాలని కమిటీ చెప్పింది. ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఏపీకి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించడం కూడా సబబేనని కమిటీ అభిప్రాయపడింది.

వెబ్దునియా పై చదవండి