గుంటూరులో కలకలం : విందు పార్టీతోనే కరోనా వ్యాప్తి...

ఆదివారం, 29 మార్చి 2020 (18:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో నాలుగు కేసులు ఒక్క గుంటూరు జిల్లాలోనే నమోదయ్యాయి. ఈ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తొలుత కరోనా బారినపడ్డారు. ఈ వ్యక్తి ఇచ్చిన విందు పార్టీకి అనేక మంది హాజరయ్యారు. దీంతో జిల్లాలో కలకలం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమైది. 
 
కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన వారిపై అధికార వర్గాలు ఆరా తీశాయి. మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో 30 మందిని గుర్తించారు. వారందరినీ ఐదు అంబులెన్స్‌ల్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు, ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో 23 మందిని కలిసినట్టు కూడా అధికారులు గుర్తించారు. వారిని కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
 
మరోవైపు, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబానికి కాటూరి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం చేయించడం అభినందనీయం అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య కొనియాడారు. ఆనాడు విందులో చాలామంది పెద్దలు పాల్గొన్నట్టు సమాచారం ఉందని, వారందరికీ నిర్బంధ వైద్యం చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సత్వర చర్యలకు గుంటూరు కలెక్టరుకు ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు