నిర్ణయం తీసుకున్నా.. జనవరి 20న ఆమోదముద్రవేద్దాం : మంత్రులతో జగన్!!

శనివారం, 28 డిశెంబరు 2019 (11:58 IST)
అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్టణం తరలించడం ఖాయమని, ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అయితే, తన నిర్ణయానికి జనవరి 20వ తేదీన అసెంబ్లీని సమావేశపరిచి ఆమోదముద్ర వేద్దామని శుక్రవారం తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. 
 
శుక్రవారం జరిగిన కేబినెట్‌ భేటీలో రాజధాని నగరం మార్పు.. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, పంచాయతీ ఎన్నికలకు పాత విధానంలోనే రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చ జరిపారు. ఈ కేబినెట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలు, సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. 
 
మంత్రివర్గం సమావేశమైన వెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీఎంకు నివేదిక సమర్పించింది. దాదాపు 4,075 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఆధారాలున్నాయని అందులో పేర్కొంది. మరికొంత గడువు ఇచ్చి ఉంటే.. దాదాపు 10 వేల ఎకరాల సమాచారం సమర్పించేవాళ్లమని బుగ్గన తెలిపారు. 
 
ఆ తర్వాత రాజధానిని విశాఖకు తరలించాల్సిన అవసరంపై ముఖ్యమంత్రి 45 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత విశాఖకు రాజధాని తరలింపును తక్షణం ఆమోదింపజేసుకుందామని పలువురు మంత్రులు సూచించారు. ఆ సమయంలో సీనియర్‌ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన, బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్‌, పేర్ని వెంకట్రామయ్య (నాని) తదితరులు కలుగజేసుకుని తొందరపాటు తగదన్నారు. 
 
ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటోందన్న ముద్రపడకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. న్యాయపరమైన ప్రతిబంధకాలు ఎదురుకాకుండా.. అంతా సవ్యంగా జరిగేలా చూడాలని.. హైపవర్‌ కమిటీ వేయాలని చెప్పారు. దీనికి సీఎం జగన్ కూడా ఏకీభవించారు. '3న బోస్టన్‌ నివేదిక వస్తుంది. వెంటనే మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌లతో హైపవర్‌ కమిటీ వేద్దాం. అధ్యయనానికి 15 రోజుల గడువిద్దాం. జనవరి 18న నివేదిక ఇస్తే.. 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదిద్దాం. మర్నాడు అసెంబ్లీ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. విశాఖకు రాజధాని నగరాన్ని ఎందుకు మార్చాల్సి వస్తుందో ప్రజలకు వివరిద్దాం' అని సీఎం జగన్ వివరించినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు