ఆంధ్రప్రదేశ్‌లో శనివారం పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండో రోజు కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. అయితే, ఈ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని పలు ప్రాంతాల్లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థులను కొన్ని చోట్ల అడ్డుకున్నారు. వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలను వైసీపీ నేతలు, కార్యకర్తలు లాక్కొన్నారు. అయోధ్యపురం కేంద్రం వద్ద నామినేషన్ వేసేందుకు వెళ్లిన గున్న సుధ నామినేషన్ పత్రాలను రెండుసార్లు లాక్కున్నట్లు అభ్యర్థులు మీడియాకు తెలిపారు.
తలగాంలోని నామినేషన్ కేంద్రం వద్ద కూడా ఇటువంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. తలగాం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థి కోట కళావతి, మరో ఆరుగురు వార్డు సభ్యులు నామినేషన్ వేసేందుకు వెళ్లగా పేరాడ వినోద్ కుమార్ అనే వ్యక్తి పత్రాలు తీసుకొని పారిపోయాడు. పోలీసులు వెంటనే అతడిని పట్టుకుని వాటిని తిరిగి తీసుకున్నారు.