బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూ తిరుపతిలోని అలిపిరి వద్ద అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయడంపై బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబుకు తెలిసే ఈ దాడి జరిగిందని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. అమరావతిలోనే ఈ కుట్రకు ప్రణాళిక వేశారని ఆరోపించారు. ఇందుకు గానూ అమిత్ షాకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఈ ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ... ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమిత్ షాపై దాడి చేశారని, చంద్రబాబే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు.
అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంఘటనపై సీపీఐ నేత నారాయణ తన దైన శైలిలో స్పందించారు. అలిపిరి నిరసనను దాడిలా చూడటం సరికాదని, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న ఆవేదన ప్రజల్లో ఉందని గుర్తు చేశారు.
ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని వ్యతిరేకించడం సహజమేనని, ఈ సంఘటన ద్వారా తెలుగు ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరముందని, ''హోదా'' ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నారాయణ విమర్శించారు.