అంతర్వేది కొత్త రథం ఆకృతి సిద్ధం

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (08:06 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్‌, ఏసీ  భద్రాజీ రథం నిర్మాణంపై చర్చించారు.

రథం నిర్మాణానికి, షెడ్డు మరమ్మతులతో పాటు ఇనుప షట్టర్‌ అమర్చడానికి రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవాదాయశాఖ ఈఈ శేఖర్‌ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. దగ్ధమైన రథానికి రూ.84 లక్షల బీమా ఉన్నా.. ఆ సొమ్ము రావడానికి కొంత సమయం పడుతుంది.

అందుకే వీలైనంత త్వరగా ప్రభుత్వ నిధులతో రథం నిర్మాణం చేపట్టనున్నారు. 2021 ఫిబ్రవరిలో స్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. అప్పటిలోగా రథం సిద్ధమవుతుందని ఆలయ సహాయ కమిషనర్‌ భద్రాజీ తెలిపారు.

కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నట్లు ఏసీ భద్రాజీ వివరించారు.
 
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రధం దగ్ధమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన రథ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించడానికి అవసరమైన కలపను తూర్పుగోదావరి జిల్లాలోని పలు అడితిల వద్ద పరిశీలించామని మంత్రి వేణు అన్నారు.

దేవాలయాలపై జరిగే దాడులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అంతర్వేది రథ దగ్ధ దాడికి సంబంధించిన వ్యక్తులను పట్టుకునేందుకు సీబీఐ విచారణకు ప్రతిపాదించడం జరిగింది అని నూతన రథాన్ని స్వామి వారి కళ్యాణోత్సవంలోపు సిద్ధం చేస్తామని, ఈ బృహత్తర కార్యక్రమానికి నాణ్యమైన కలప కోసం అధికారులు జిల్లా అంతా పర్యటించగా రావులపాలెంలో రధం నిర్మాణానికి అనువైన కలప దొరకడం జరిగింది.

రధం నిర్మాణం కోసం 80 రధాల నిర్మాణం చేసిన అనుభవం కలిగిన గణపతి ఆచారి, ప్రత్యేక అధికారి ఏ.డి.సి చంద్ర మోహన్, అసిస్టెంట్ కమీషనర్ ఆధ్వర్యంలో కలపను ఎంపిక చేయడం జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగిన పట్టించుకున్న దాఖలాలు లేవని సీబీఐ అంటేనే టీడీపీ ప్రభుత్వం భయపడిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవాలని మంత్రి వేణు అన్నారు.

ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోకి సీబీఐ ని రానివ్వకుండా భయపడ్డది టీడీపీ ప్రభుత్వం అని, ఇప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు. అంతర్వేదిలో రథ దగ్ధ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించారని, దానికి సంబంధించి దోషులు ఎంతటివారైనా గుర్తించి శిక్షించడం జరుగుతుందన్నారు.

లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నూతన రథ నిర్మాణానికి కలప తన నియోజకవర్గం నుంచి ఎంపిక చేయడం ఆనందదాయకమన్నారు.

ఈ కార్యక్రమంలో రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కర్రి నాగిరెడ్డి, వై.యస్.ఆర్.సి.పి జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, మాజీ మండల ప్రతిపక్ష నేత కుడుపూడి శ్రీనివాస్, టింబర్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిర్ల కనికిరెడ్డి, వాడపల్లి ఆలయ ఈఓ సత్యనారాయణరాజు, రావులపాలెం పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు