విజయవాడ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మొత్తం లక్షా 43 వేల కోట్ల రూపాయలని రాజమండ్రిలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చెప్పేవరకు మీకు తెలియదా అని బీజేపీ రాష్ట్ర పరిశీలకుడు సిద్ధార్ధ నాథ్ సింగ్ కేడర్‌ని ప్రశ్నించారు. రాష్ట్ర బిజెపి శ్రేణులు విఫలమైనట్లు రాష్ట్ర పరిశీలకుడు బిజెపి కోర్ కమిటీ సమావేశంలో పేర్కొనడంతో పలువురు బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రం ఇచ్చిన నిధులు కేంద్ర కాబినెట్లో ఉన్న మంత్రి వెంకయ్య నాయుడు గాని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు రాష్ట్ర కాబినెట్లో బిజెపికి చెందిన మంత్రులు గాని వెల్లడించడం లేదని క్యాడర్ పరిశీలకుడికి స్పష్టం చేసింది.
కనీసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. హరిబాబు కూడా ఎప్పుడూ ఈ నిధుల విషయం ప్రస్తావించలేదని, వారెవరు చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో జాతీయ స్థాయి నాయకత్వం విచారించాలన్నారు. రాబోయే కమిటీలలో పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు పనిచేసి బిజెపిని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొన్ని శక్తులు... బిజెపి పటిష్టతకు పనిచేసే వారిని రాకుండా అడ్డుకుని, పార్టీని రాష్ట్రంలో బలహీనపరచేందుకు కుట్ర చేస్తున్నారని పలువురు బిజెపి నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన లక్షా 43 వేల కోట్ల రూపాయలు గురించి ప్రస్తావించక పోవటానికి ఇదే కారణమని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పదవులు అనుభవిస్తూ, కేంద్రం చేసే సహాయాన్ని వెల్లడించకుండా బిజెపిని రాష్ట్రంలో బలపడకుండా చేస్తున్న వారిని గుర్తించి దూరంగా ఉంచాలని డిమాండు చేశారు. తద్వారా 2019 ఎన్నికలలో పార్టీ బలపడే విధంగా పనిచేసే వారిని గుర్తించాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు.
పార్టీని ఉద్దేశపూర్వకంగా బలహీనపరచి ఎదుట పార్టీని బలపడేందుకు ఉపయోగపడుతున్న వారిని గుర్తించి పార్టీకి దూరంగా ఉంచాలని, అలాంటివారి చెప్పుడు మాటలకు విలువివ్వకుండా దూరంగా ఉంచి నిజమైన కార్యకర్తలకు స్థానం కల్పించి బిజెపి పార్టీ ని రాష్ట్రంలో బలపడేందుకు కేంద్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అంతేకాని బాధ్యులని వదలి కిందివారిపై ఆగ్రహం వ్యక్తం చెయ్యటం సరికాదని వారు బిజెపి అధిష్ఠానాన్ని కోరుతున్నారు.