అమ‌రావ‌తికి పెట్ట‌ుబ‌డుల‌తో రావాలని కోరిన చంద్ర‌బాబు...

బుధవారం, 13 జులై 2016 (19:53 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో వివిధ ప్రావిన్స్‌లకు చెందిన ముఖ్య నేతలతో మ‌రియు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించాలని, పెట్టుబడులతో వచ్చేవారికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వారికి హామీ ఇచ్చారు. అమరావతిలో భవన నిర్మాణాలకు సహకరించేందుకు మాస్కో నగరపాలక సంస్థ ముందుకొచ్చింది. 
 
మాస్కో నగరపాలక సంస్థ విజ్ఞాన, పారిశ్రామిక విభాగాధిపతి ఒలెగ్‌ బొచరొవ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధాని భవనాల నిర్మాణంలో సహకరిస్తామని, నూతన రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తమ దగ్గర ఉందని బొచరొవ్‌ హామీ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షణీయ నగరాల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలన్నది తమ నిర్ణయమని తెలిపారు. దీనికోసం 25 బిలియన్‌ యూరోలు కేటాయించినట్లు చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేసేందుకు, భారీ పరిశ్రమల స్థాపనకు చేయూతను ఇచ్చేందుకు చెలబిన్స్‌ ప్రావిన్స్‌ ముందుకొచ్చింది.చెలబిన్స్‌ గవర్నర్‌ బోరిస్‌ దుబ్రొవ్‌స్కీతో చంద్రబాబు సమావేశమయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చెలబిన్స్‌కు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.ఇరుపక్షాల తరఫున చెరో ఐదుగురు సభ్యులతో త్వరలో ఒక వర్కింగ్‌ గ్రూపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు .

వెబ్దునియా పై చదవండి