వైపాకా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం తిరుమల పర్యటనకు వెళుతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే నిమిత్తం ఆయన తిరుమలకు వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకుంటారు. ఈ పర్యటనలో ఆయన రెండు రోజుల పాటు కొండపైనే గడపనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.
సాయంత్రం 3.45 గంటలకు తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
సాయంత్రం 6 నుంచి 6.15 గంటల వరకు అలిపిరి టోల్ గేట్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు.
సాయంత్రం 6.40కి తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు.
అనంతరం బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి బయల్దేరుతారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
పిమ్మట వకుళమాత దర్శనం, ప్రదక్షిణం, వెండివాకిలి రంగనాయక మండపం కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సాయంత్రం 8.40 గంటలకు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం పొందుతారు.
అనంతరం శ్రీవారి ఆలయంలో వస్త్ర మండపం పెద్ద శేష వాహనం కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
బుధవారం సీఎం షెడ్యూల్‌ను పరిశీలిస్తే,
ఉదయం 6 గంటలకు పద్మావతి అతిథిగృహం నుంచి శ్రీవారి ఆలయానికి బయల్దేరుతారు.
ఉదయం 6.30 గంటల వరకు శ్రీవారి సేవలో పాల్గొంటారు.
ఉదయం 6.45 నుంచి 7.05 వరకు పరకామణి భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు.
పిమ్మట వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన పీవీఆర్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభిస్తారు.
ఉదయం 8.35 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరుతారు. అక్కడి నుంచి విజయవాడకు పయనమవుతారు.
నిజానికి బుధవారం ఆయన నంద్యాల పర్యటనకు వెళతారని ముందుగా అనుకున్నారు. కానీ, నంద్యాల పర్యటనకు వెళ్లకుండా ఆయన నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకోనున్నారు.