పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఎఫెక్టు : భూసేకరణ జీవో రద్దు.. ప్రకటనే తరువాయి...

శుక్రవారం, 28 ఆగస్టు 2015 (14:11 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెనక్కితగ్గింది. రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో బలవంతపు భూసేకరణ కోసం జారీ చేసిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి నారాయణ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ భూసేకరణ కోసం జారీ చేసిన జీవో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండా జారీ చేయడం జరిగిందన్నారు. అందువల్ల ఈ జీవోను రద్దు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా రైతులను ఒప్పించి భూసేకరణ చేపడుతామని ఆయన ప్రకటించారు. 
 
ఇతర ప్రాంతాల్లో రైతులు ఇచ్చినట్టుగానే స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రజా రాజధానిని నిర్మించాలన్నదే చంద్రబాబు అభిమతమని, ఏ రైతుకూ అన్యాయం జరగబోదని ఆయన వివరించారు. రైతులను ఒప్పిస్తామన్న నమ్మకం తమకుందని నారాయణ తెలియజేశారు. కాగా, భూసేకరణ జీవో వెనక్కు తీసుకోవడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి