నిమ్మగడ్డ అంశంలో నో కాంప్రమైజ్? సుప్రీంలో వైకాపా సర్కారు అప్పీల్!

శుక్రవారం, 29 మే 2020 (16:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించేలా ఆదేశిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఇచ్చిన సంచలన తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని భావిస్తోంది. ఇదే అంశంపై న్యాయనిపుణులతో పాటు.. సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది. 
 
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించేందుకు ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అందులే ఎస్ఈసీ పదవికాలాన్ని కుదించింది. పైగా, దీంతో రమేష్ కుమార్‌ను ఎస్ఈసీ బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను నియమించింది. దీన్ని బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు... తుది తీర్పును శుక్రవారం వెలువరించింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిమ్మగడ్డ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సును రద్దు చేసింది. 
 
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. కోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అలాగే, న్యాయనిపుణులతో కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. పైగా, నిమ్మగడ్డ వ్యవహారంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కారాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు