అమరావతి : పవిత్రమైన విశ్వవిద్యాలయాల్లో ఏవైనా అక్రమాలు జరిగితే అందుకు వైస్ చాన్సలర్లే బాధ్యత వహించాలని, వర్శటీల కీర్తి ప్రతిష్టలకు మచ్చ తెస్తే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎస్వీ యూనివర్శటీలో అక్రమాల ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంత్రి గంటా, వర్శటీ వ్యవహరాలపై శుక్రవారం స్పందించారు.
ఇటీవల అనేక వర్శటీల్లో నియామకాల్లో అక్రమాలు, నిధుల వినియోగంలో అవినీతి లాంటి అంశాలు తమ దృష్టికి వస్తున్నాయని అన్నారు. వీటిపై వీసీలు చర్యలు తీసుకొని సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదనే ఉద్దేశంతోనే ఎస్వీయూలో జరుగుతున్న అంశాలపై ఉన్నతస్థాయి కమిటీని వేశామని స్పష్టం చేశారు. ఇక నుంచి ఏ కమిటీ వేసినా నిర్దేశిత సమయంలో విచారించి.. విచారణ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్వీ యూనివర్శటీ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ఎస్వీయూ వ్యవహారాలపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మంత్రి గంటా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జీవో ఆర్.టి. నెం 160ని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఎపి ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వల్లికుమారి నేతృత్వంలో విచారణ జరగనుంది. నియామకాలు, పత్రికల్లో వచ్చిన కథనాలతో పాటు ఎవరైనా ఫిర్యాదులు ఇస్తే వాటిని కూడా వల్లికుమారి కమిటీ విచారణ నిర్వహించనుంది. వర్శటీ కీర్తి ప్రతిష్టలను కాపాడేందుకే కమిటీని వేశామని, విచారణ కమిటీ నిర్ణయం మేరకు తగు చర్యలు వుంటాయని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.