ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, గ్రామాణాభివృద్ధి శాఖామంత్రిగా ఉన్న నారా లోకేశ్... పలు సందర్భాల్లో.. పలు వేదికలపై మాట్లాడుతూ తప్పులు మాట్లాడి అభాసుపాలయ్యారు. ముఖ్యంగా జయంతికి బదులు వర్థంతి, వర్థంతి శుభాకాంక్షలు అంటూ నోరుజారి ఆ తర్వాత నాలిక్కరుచుకున్నారు. ఇపుడు ఇదేవిధంగా సీనియర్ మంత్రిగా ఉన్న కె అచ్చెన్నాయుడి నోటి వెంట కూడా తప్పులు దొర్లుతున్నాయి. ఇలా రావడానికి మంత్రి లోకేశ్ సాహచర్యమేనంటూ సమాధానమిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 108వ జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... గౌతు లచ్చన్న వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. వెంటనే పక్కనున్న వారు తప్పును సవరించగా, వెంటనే అచ్చెన్న కల్పించుకుని లోకేశ్ సాహచర్యంతోనే తనకూ అలాగే వచ్చిందని చెప్పి అక్కడున్న వారిని నవ్వించారు. మొత్తంమీద తాను చేసిన తప్పును లోకేశ్‌పై నెట్టేశారు. కాగా, గతంలో బీఆర్ అంబేద్కర్ జయంతిని నారా లోకేశ్ వర్థంతిగా పేర్కొని విమర్శలు పాలైన విషయం తెల్సిందే.