ఏపీలో కరోనా వైరస్ స్వైర విహారం... 108 మంది మృత్యువాత

మంగళవారం, 11 మే 2021 (17:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 20,345 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 86,878 కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. 
 
ఈ కేసులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 2,371 కేసులు, అనంతపురం జిల్లాలో 1,992 కేసులు, గుంటూరు జిల్లాలో 1,919 కేసులు గుర్తించారు.
 
అదేసమయంలో 14,502 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, 108 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సోమవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణించిన వారు కూడా ఉన్నారు.
 
ఇక, ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి పెరిగింది. ఇప్పటివరకు 11,18,933 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 1,95,102 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 8,899కి పెరిగింది.
 
ఇదిలావుంటే కరోనా దెబ్బకు కర్ణాటక విలవిల్లాడుతోంది. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగింది. ఇప్పుడు మహారాష్ట్రను కర్ణాటక అధిగమించింది. 
 
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.29 లక్షల కొత్త కేసులు నమోదు కాగా... వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 39,305 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో మహారాష్ట్ర 37,236 కేసులను నమోదు చేసింది.  
 
ఒక్క బెంగళూరులోనే నిన్న 16,747 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో నగరంలో 374 మంది మృతి చెందారు. ప్రస్తుతం కర్ణాటకలో 9,67,409 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సోమవారం నుంచి కర్ణాటకలో పూర్తి స్థాయి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. 15 రోజుల లాక్డౌన్‌ను కర్ణాటక ప్రభుత్వం విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు